icon
×

Digital Media

2 May 2022

How to properly use an asthma inhaler

Inhaler Using Tips : ఆస్తమా ఉన్నవారు ఇన్హేలర్ వాడుతున్నారా.. ఇలా చేయండి..

కొంతమంది ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బందిపడతారు. అయితే జలుబు మరియు జ్వరం వంటి మొదలైన లక్షణాలు ఉన్నప్పుడు ఈ సమస్య వస్తే అది సాధారణమే. కానీ తరచుగా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తే కచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించాలి. కొన్ని సందర్భాలలో సైనసైటిస్ వల్ల కూడా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ లంగ్స్‌కి సంబంధించిన సమస్యలు మరియు ఇతర కారణాల వల్ల ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది కలిగితే అది చాలా ప్రమాదకరం. చాలా సందర్భాలలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అవి దీర్ఘకాలికంగా కూడా మారుతాయి.

ఆస్తమా వల్ల సరైన విధంగా గాలి తీసుకోరు, దాంతో ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టం అవుతుంది. అంతేకాకుండా దగ్గు కూడా వస్తుంది మరింత తీవ్రంగా ఉంటే విజిల్ వేసిన సౌండ్ వస్తుంది. ఇలా రావడానికి ఊపిరి తీసుకోకపోవడమే కారణం. మీ వయస్సు మరియు జీవన విధానం బట్టి ఆస్తమా లక్షణాలు కూడా మారుతూ ఉంటాయి. కానీ మీ లక్షణాలు మారితే కనుక డాక్టర్‌ను సంప్రదించి తగిన చర్యలు తీసుకోవడం ఎంతో అవసరం అని గమనించాలి. అయితే ప్రతి ఒక్కరికి ఆస్తమా ఒకే విధంగా ఉండదు. కొంత మందికి కొన్ని లక్షణాలు కనబడతాయి, మరి కొందరికి మరి కొన్ని లక్షణాలు కనబడతాయి అవి ఏమిటి అంటే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది గా ఉండడం, చాతిలో నొప్పి లేక ఇబ్బంది కలగడం, ఊపిరి వదిలేటప్పుడు విజిల్ సౌండ్ రావడం, ఊపిరి సరిగా అందకపోవడం వల్ల నిద్ర సరిగా ఉండకపోవడం మరియు ఆస్తమా వచ్చినప్పుడు దగ్గు ఎక్కువగా రావడం వంటి మొదలైన లక్షణాలు కనబడతాయి.

మరి మీరు డాక్టర్ ను ఎప్పుడు సంప్రదించాలి...?

మీకు సమస్య ఉందని అనిపిస్తే మీరు డాక్టర్‌ని సంప్రదించాలి. అదే విధంగా వ్యాధి నిర్ధారణ అయ్యాక. తరచుగా వైద్యుడిని కలవడం మంచిదని చెబుతున్నారు డా. సుధీర్. ఈయన హైదరాబాద్ హైటెక్‌సిటీలోని కేర్ హాస్పిటల్‌లో సీనియర్‌ పల్మనాలజిస్ట్‌గా ఉన్నారు. రెగ్యులర్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ అవుతుండడం వల్ల సమస్య ఎంత తీవ్రత ఏంటి, దీని ప్రకారం ఏ మెడికేషన్ తీసుకోవాలన్నది సూచిస్తారు. దీంతో సమస్యని త్వరగా తగ్గించుకున్నవారవుతాం. అదే విధంగా ఎప్పుడైతే మీరు తగిన మెడికేషన్‌ను తీసుకున్నా ఉపయోగం లేకపోయినా కచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాలి, ఊపిరి తీసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నా లేక చాలా సమయం వరకు అదే పరిస్థితి ఉన్నా వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలి. ఆస్తమాతో బాధపడే వారు ఖచ్చితంగా ఇన్హేలర్ ను ఉపయోగిస్తారు. అయితే ఇన్హేలర్ ను ఉపయోగించినా ఎటువంటి ప్రయోజనం మీరు వెంటనే పొందకపోతే తప్పకుండా డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. చాలా తేలిక పాటి వ్యాయామాలు చేసినా మీరు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. ఇలా ప్రతి విషయం గురించి డాక్టర్ సలహా తీసుకోవడం చాలా మంచిది.

ఆస్తమా అనేది నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఇది పిల్లలు లేక పెద్దలలో కూడా ఉంటుంది. శ్వాసనాళాలు మూసుకుపోయినప్పుడు ఈ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( డబ్ల్యూహెచ్వో ) ప్రకారం ఇన్హేలర్ ద్వారా మెడికేషన్ ను ఉపయోగిస్తే కచ్చితంగా ఆస్తమా లక్షణాలను తగ్గించుకోవచ్చు మరియు సాధారణమైన జీవితాన్ని కూడా పొందవచ్చు అని డా. సుధీర్ చెబుతున్నారు.

339 మిలియన్ల పైబడి వ్యక్తులు ప్రపంచ వ్యాప్తంగా ఆస్తమాతో బాధ పడుతున్నారు అని డబ్ల్యూహెచ్వో చెబుతోంది. అంతే కాకుండా 4,17,918 మరణాలు కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆస్తమా వల్ల చోటు చేసుకున్నాయి అని 2016 లో వచ్చిన గ్లోబల్ ఆస్తమా రిపోర్ట్ చెబుతోంది. అయితే 2018కి భారత దేశంలో 1.3 బిలియన్ల మంది ఆస్తమాతో బాధపడే వారు ఉండగా ఇందులో ఆరు శాతం మంది పిల్లలు మరియు రెండు శాతం మంది పెద్ద వారు ఉన్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఒకటిన్నర నుండి రెండు కోట్ల వరకు ఆస్తమాతో బాధపడే పేషెంట్లు ఉన్నారని అంచనా, అంటే ప్రపంచంలో ఉన్న పదిమంది ఆస్తమా పేషెంట్లలో ఒకరు మన దేశంలో ఉన్నట్టు. అయితే దురదృష్టవశాత్తు పిల్లలకి ఎక్కువగా ఈ సమస్య వస్తోంది.

​సింగిల్‌ మెంటనెన్స్ అండ్ రిలీవర్ థెరపీ..

ఇది రెండు విధాలుగా పనిచేస్తుంది. మెంటనెన్స్‌లా పనిచేస్తుంది అదే విధంగా రిలీవర్‌లా కూడా పనిచేస్తుంది. కాబట్టి, రెగ్యులర్‌గా వాడొచ్చు. అవసరమైనప్పుడు కూడా వాడొచ్చు. ఇది కూడా ఎప్పట్నుంచో ఉన్న టెక్నిక్ ఈ విధానంలో పేషెంట్‌ పరిస్థితిని బట్టి ఇన్హేలర్‌ని వాడొచ్చు. దీనిని మెంటనెన్స్ అండ్ రిలీవర్ థెరపీ(Single Maintenance and Reliever Therapy) SMART అంటారు. అదే విధంగా, రెస్క్యూ ఇన్హేలర్స్‌ను వెంటనే ఉపశమనం పొందేందుకు ఉపయోగించవచ్చు. హఠాత్తుగా ఎలాంటి లక్షణాలు అయినా మీరు ఎదుర్కొన్నప్పుడు తప్పకుండా ఈ రెస్క్యూ ఇన్హేలర్ మీకు సహాయం చేస్తుంది. పైగా దీనిని ఉపయోగించిన వెంటనే మీరు ఊపిరి సాధారణంగానే పీల్చుకోగలుగుతారు. కాకపోతే వీటిని ప్రతి రోజూ ఉపయోగించకూడదు. కేవలం ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే ఉపయోగించాలి. అదే విధంగా మరో గొప్ప సదుపాయం కూడా ఉంది.

అయితే చాలా శాతం మంది ఇన్హేలర్‌ను తరచుగా ఉపయోగిస్తారు. దాని వల్ల ఆస్తమా లక్షణాలు తగ్గుతాయి. అయితే ఇన్హేలర్‌ను సరైన విధంగా ఉపయోగించుకోవాలి. ఒకవేళ సరైన పద్ధతిలో ఉపయోగించక పోతే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తగ్గవు. అందువల్ల ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకునే ఇన్హేలర్‌ను ఉపయోగించాలి. అంతే కాకుండా దీనిని తరచుగా ఉపయోగించేవారు కచ్చితంగా డాక్టర్ చెబితేనే ఉపయోగించండి. ఇన్హేలర్ ఉపయోగించే ముందు తప్పకుండా ఇన్హేలర్ టెక్నిక్‌ను తెలుసుకోవాలి. అలాంటప్పుడే అందులో ఉన్న మెడిసిన్ ఊపిరితిత్తుల వరకు చేరుతుంది.

అలాంటప్పుడే ఇన్హేలర్ వల్ల మీకు ఉపయోగం కలుగుతుంది. దాంతో పాటుగా ఆస్తమా మరియు ఇతర సమస్యలు దూరం అవుతాయి. పైగా ఆ వ్యాధి యొక్క లక్షణాలు తగ్గుతాయి. చాలా మంది డాక్టర్స్ ఇన్హేలర్ ఉపయోగించాలి అని సూచిస్తారు. దాని వల్ల మీరు ఇబ్బంది పడుతున్నటు వంటి ఆస్తమా లక్షణాలు తగ్గుతాయి. అంతే కాకుండా అది ఎక్కువ అవ్వకుండా కంట్రోల్‌లో కూడా ఉంచుతుంది. కాబట్టి మీరు ఆస్తమా పేషెంట్ అయ్యుండి ఇన్హేలర్ ను ఉపయోగిస్తూ ఉంటే ఈ చర్యలు తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే సరైన విధంగా ఉపయోగిస్తేనే మీకు సరైన ఫలితం ఉంటుంది.

​కంట్రోలర్ ఇన్హేలర్ :

ఈ కంట్రోలర్ ఇన్హేలర్‌ను ప్రతి రోజూ ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ఇన్హేలర్‌లను మీ స్థితిని మరింత బాగు చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ప్రతి ఒక్కరికి ఒకే విధమైన లక్షణాలు ఉండవు, కాబట్టి మీ డాక్టర్ రోజుకు ఒకసారి లేక రెండుసార్లు ఎలాంటి సూచనలు ఇస్తే అలాంటి సూచనలు తప్పకుండా పాటించాలి. అది మీ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది అని గమనించాలి. మీరు మంచి ఫలితాన్ని పొందాలి అంటే కనీసం రెండు నుండి నాలుగు వారాల వరకు ఇన్హేలర్ ద్వారా మెడిసన్ ను తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ మెడికేషన్‌ను తీసుకోవడం వల్ల శ్వాసనాళాల్లో వాపు తగ్గుతుంది. దాంతో మూసుకు పోయిన శ్వాసనాళాలు మెల్లిగా తెరుచుకుంటాయి. ఈ విధంగా ముప్పు తగ్గుతుంది, కానీ ఓకే సారీ ఆస్తమా వల్ల వచ్చే లక్షణాలు మాయమైపోవు కాకపోతే దీర్ఘకాలికంగా ఈ లక్షణాలు ఉండకుండా ఉంటాయి. ఎక్కువగా కాలుష్యం ఉండేటు వంటి ప్రదేశాలలో ఉండడం వల్ల చాలా త్వరగా జబ్బున పడతారు. అలాంటప్పుడు ఈ కంట్రోలర్ ఇన్హేలర్ ను మీరు కచ్చితంగా అవసరం.

ఎందుకంటే తరచుగా ఉపయోగించే వారికి ఇదే గొప్ప ఎంపిక. అందుకే ఎక్కువగా ఆస్తమా లక్షణాలు ఉన్నప్పుడు ఆస్తమా పేషెంట్స్ వారితోనే ఈ ఇన్హేలర్‌ను తీసుకువెళ్తూ ఉంటారు. వాతావరణంలో ఎలాంటి మార్పు వచ్చినా, కాలుష్యం, పొగ ఎక్కువగా ఉన్నా, కొద్దిదూరం నడిచినా లేక తేలికపాటి వ్యాయామాలు చేసిన చాలా సులువుగా అలసిపోతారు. అంతే కాకుండా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. కాబట్టి కచ్చితంగా మీరు కంట్రోలర్ ఇన్హేలర్‌ను ఉపయోగించండి.

​శారీరక వ్యాయామాలు :

ఆస్తమాతో బాధపడేవారికి యోగా ది బెస్ట్ అని చెప్పొచ్చు. యోగాలోని బ్రీథింగ్ టెక్నిక్స్ చాలా వరకూ ఉపశమనాన్ని ఇస్తాయి. వీటిని రెగ్యులర్‌గా ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. అదేవిధంగా ఒకవేళ మీరు వ్యాయామాలు చేయడం, స్విమ్మింగ్, సైక్లింగ్, మరియు పాటలు పాడడం వంటి పనులు చేయడం వల్ల మీరు ఊపిరి తీసుకోవడానికి కష్టమవుతుంది. పైగా ఇలాంటి శారీరకంగా పని చేయడం లేక బాగా అలసిపోవడం వల్ల ఎంతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి పనుల్లో చేసినప్పుడు చేసే 15 నుండి 30 నిమిషాల ముందు రెస్క్యూ ఇన్హేలర్ ను ఉపయోగించండి. అలా చేయడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ మీరు మీతో ఎప్పుడు రెస్క్యూ ఇన్హేలర్ ను క్యారీ చేయండి. ఎందుకు అంటే ఏ సమయంలో మీకు అవసరం అవుతుందో తెలియదు, కాబట్టి మీతోనే ఉంచుకోండి. మరీ ముఖ్యంగా తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. దాంతో పాటుగా లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. కాకపోతే మీ డాక్టర్ సూచనలు తీసుకుని దాని ప్రకారం వ్యాయామాలు చేయండి.

​సరైన టెక్నిక్‌ను ఉపయోగించండి :

ఇన్హేలర్ ను ఉపయోగించడం తేలికే అని అందరూ భావిస్తారు, అయితే అది సరైనది కాదు. ఎందుకంటే సరైన టెక్నిక్ ఉపయోగించకపోతే మీరు ఉపయోగించే మెడిసన్ లంగ్స్‌ వరకూ చేరదు. కాబట్టి సరైన టెక్నిక్‌ను తెలుసుకోండి. ఇన్హేలర్స్‌లో చాలా రకాలు ఉంటాయి మీటర్ డోస్ ఇన్హేలర్స్, డ్రై పౌడర్ ఇన్హేలర్స్ మరియు నిబ్యులైజర్స్ వంటి మొదలైన ఇన్హేలర్ లు ఉంటాయి. అయితే మీ కండిషన్ ప్రకారం ఏది ఉపయోగించాలి అనేది డాక్టర్ చెబుతారు.

అలాంటప్పుడు మీ డాక్టర్ సూచించిన ఇన్హేలర్ గురించి కూడా వారే చెబుతారు. కాబట్టి సరైన టెక్నిక్‌ను డాక్టర్ దగ్గర నేర్చుకోండి లేక ఏ మెడికల్ ఎక్స్పర్ట్‌నైనా కనుక్కోండి. ఈ విధంగా మీరు గైడెన్స్ తీసుకుని ఆ తర్వాత మాత్రమే ఇన్హేలర్ ను ఉపయోగించడం ప్రారంభించండి. సరైన గైడెన్స్ లేకుండా అసలు ప్రయత్నించవద్దు.

​చివరిగా..

ఎప్పుడైతే ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది కలుగుతుందో లేక కొన్ని సెకండ్ల పాటు ఊపిరి అందకుండా ఉంటుందో వాటిని బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అంటారు. ఇవి తరచుగా మరియు హఠాత్తుగా వస్తూ ఉంటాయి. మీరు సరిపడా గాలిని తీసుకోలేరు. కొంత మందికి టెన్నిస్ వంటి ఆటలు ఆడిన తర్వాత ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది. అయితే ఇది బ్రీతింగ్ ప్రాబ్లం కింద పరిగణించ వద్దు. ఈ మధ్య కాలంలో కాలుష్యం ఎక్కువ అవ్వడం తో కూడా చాలా మందికి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంతే కాకుండా మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి.

అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం అస్సలు చేయకూడదు. వీటి వల్ల కూడా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని డాక్టర్లు చెబుతున్నారు. వీటన్నిటితో పాటు అలర్జీలు, గొంతుకు సంబంధించిన సమస్యలు కూడా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్‌కు దారి తీస్తాయి. అలాంటప్పుడు కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించి సరైన ట్రీట్మెంట్ మరియు మెడికేషన్ ను తీసుకోవాలి. దాంతో పాటుగా మీ జీవన విధానాన్ని మార్చుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకునే మార్గం ని ఎంపిక చేసుకోవాలి. అయితే ముఖ్యంగా మెడిటేషన్‌ను చేయండి. ఆస్తమా వంటి వ్యాధితో దీర్ఘకాలంగా బాధపడుతుంటే మీరు తరచుగా డాక్టర్‌ను సంప్రదిస్తూ ఉండాలి.

ఈ సమస్యతో బాధపడుతుంటే మీ రోజు వారి పనులు చేసుకోవడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎక్కువ శ్రమ పెట్టి చేయాల్సిన పనులు అసలు చేయడం కుదరదు. కొంత మందికి ఆస్తమా అనేది వారి జీవితంపై ఎక్కువ ప్రభావం చూపదు మరియు కొన్ని సార్లు మాత్రమే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అయితే చాలా మందిలో ఆస్తమా పెద్ద సమస్యగా కనబడుతుంది పైగా వారి పనులు కూడా వారు సక్రమంగా చేసుకోలేరు. అంతే కాకుండా కొన్ని రకాల ఆహార పదార్ధాలు తినడం వల్ల ఆస్తమా ఇంకా ఎక్కువ అవుతుంది. నిజానికి ఈ సమస్యను అస్సలు నయం చేయడం కుదరదు కానీ వాటి లక్షణాలను తగ్గించుకోవచ్చు.

​ఇన్హేలర్‌ను శుభ్రం చేసుకోవాలి :

మీరు ఇన్హేలర్ ను ఉపయోగించిన తర్వాత దానిని శుభ్రం చేసుకోవడం ఎంతో అవసరం. చాలా మంది దీనిని పాటించరు. మీరు ఇన్హేలర్ ఉపయోగించిన ప్రతి సారి ఇన్హేలర్ యొక్క మౌత్ పీస్ దగ్గర వాష్ చేయాలి. దానిని గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేయవచ్చు. ఆ తరువాత పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇన్హేలర్ బాగా ఆరిపోయిన తర్వాత మాత్రమే దానిని ఫిక్స్ చేసి దాచుకోవాలి. ఈ విధంగా ఫిక్స్ చేసే ముందు ఎటువంటి నీరు మరియు తేమ ఉండకుండా చూసుకోండి.

దీంతో పాటు, చాలా శాతం మందికి ఇన్హేలర్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అని తెలియదు. అయితే సహజంగా చాలా ఇన్హేలర్‌లకు ఎక్స్పైరీ డేట్ ఒక సంవత్సరం వరకు ఉంటుంది. మీ ఇంటి యొక్క ఎక్స్పైరీ డేట్ తెలుసుకోవాలి అని అనుకుంటే ఇన్హేలర్ బాక్స్ పైన చూడండి. ఎక్స్పైరీ అయిన ఇన్హేలర్ ను ఉపయోగించడం వల్ల ఏ ప్రమాదం ఉండదు. కానీ ఉపయోగించకపోవడం మేలు. ఎందుకంటే వాతావరణంలో ఉండేటు వంటి తేమ మరియు ఇతర కారణాలు వలన మీ ఇన్హేలర్ కండీషన్ పాడవుతుంది. కాబట్టి ఎక్స్పైరీ అవ్వగానే కొత్త దానితో రీప్లైస్ చేసుకోవడమే మేలు.

ఇలాంటి చర్యలు అన్నీ మీరు ఇన్హేలర్ ఉపయోగించేటప్పుడు తీసుకోవాలి. ఈ విధంగా చేస్తే మీరు ఎఫెక్టివ్ గా ఇన్హేలర్‌ను ఉపయోగించినట్టే. ఒకవేళ మీకు ఎలాంటి సందేశాలు ఉన్న లేక లక్షణాలు మారుతున్నా తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోండి మరియు వెంటనే డాక్టర్ ను కూడా సంప్రదించండి. ఎందుకు అంటే ఆస్తమా సమస్య ను నెగ్లెక్ట్ చేస్తే మరింత ప్రమాదం ఉంటుంది, కనుక తగిన జాగ్రత్తలు వెంటనే తీసుకోండి. అదే విధంగా ఆస్తమాకి మెడిసిన్ కంటే ఇన్హేలర్ బాగా పనిచేస్తుంది. కాబట్టి కచ్చితంగా ఇన్హేలర్‌ని వాడడం అలవాటు చేసుకోండి.

Reference: https://telugu.samayam.com/lifestyle/health/how-to-properly-use-an-asthma-inhaler-know-here-all-details/articleshow/91253788.cms?story=3