Hyderabad
Raipur
Bhubaneswar
Visakhapatnam
Nagpur
Indore
Chh. SambhajinagarConsult Super-Specialist Doctors at CARE Hospitals
10 January 2023
సాధారణంగా, తల బరువు మొత్తం మెడపైనే ఉంటుంది. నొప్పి వస్తేనే తెలుస్తుంది మెడ పరిస్థితి గురించి. ఈ మధ్యకాలంలో చాలా వరకూ అందరూ మెడనొప్పి అంటూ బాధపడుతున్నారు. నగలు బదులు మెడపట్టీలు వేసుకుని తరుగుతున్నారు. దీంతో సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నొప్పి వస్తే ఏదో ఓ పెయిన్ బామ్ రాయడం, పెయిన్ కిల్లర్ వేయడం, సమస్య అప్పటికీ తగ్గకపోతే సర్జరీ వరకూ వెళ్ళడం.. ఇలాంటి సమస్యలు ముందు నుంచి ముదరకుండానే జాగ్రత్తపడితే మెడ నొప్పి నుంచి ఈజీగా ఎస్కేప్ అవ్వొచ్చు. మెడను జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. అందుకే ముందుగా మెడ దగ్గర ఉండే వెన్నుపూస గురించి తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అందులో ఇప్పుడు స్పైనల్ కార్డ్ గురించి తెలుసుకుందాం.
మెడ దగ్గర ఉండే వెన్నెముకలో ఏడు వెన్నుపూసలు ఉంటాయి. వాటిలో మొదటి వెన్నుపూసను అట్లాస్ అని అని, రెండో వెన్నుపూసను ఆక్సిస్ అని అంటారు. ఆ తర్వాత పూసలను వరుసగా సర్వైకల్ 3, 4, 5, 6, 7 అంటారు. ఇవన్నీ కూడా జాయింట్స్‌గా ఉంటాయి. వీటిలోనే స్పైనల్ కెనాల్ ఉంటుంది. దీని ద్వారా స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపాము మెదడు నుండి కాళ్ళు, చేతులకు నరాలను తీసుకెళ్తుంది. ఓ వెన్నుపూసకు, మరో వెన్నుపూసకు ఉండే ఇంటర్ వర్టిబ్రల్ పారామినా నుండి ఒక్కో నరం బయటకు వస్తుంది. ఈ నరాలు ఒక్కోవైపుకి విస్తరించి ఉంటాయి. వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్ షాక్ అబ్జార్బర్‌లా పనిచేస్తుంది. డిస్క్‌కి రక్తం అవసరం లేదు. మనం తీసుకున్న ఫుడ్‌తోనే పోషకాలు అందుతాయి. శరీర బరువు, తలబరువుని బ్యాలెన్స్ చేసేందుకు ఇది హెల్ప్ అవుతుంది.
మనం సరిగ్గా కూర్చోకపోవడం, నిల్చోకపోవడం వల్లే మెడనొప్పి ఎక్కువగా వస్తుంది. డిస్క్ వల్ల కూడా ఒక్కోసారి నొప్పి ఎక్కువగా ఉంటుంది. డిస్క్ జారి నరాల మీద ఒత్తిడి కలిగినప్పుడే ఈ నొప్పి ఉంటుంది. వెన్నుపూసలో నుండి మెదడులోకి వెళ్లే రెండు రక్తనాళాలైన వర్టిబ్రల్ ఆర్టరీస్ చిన్న మెదడుకి రక్తాన్ని అందిస్తాయి. నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆర్టరీస్ రక్త ప్రసారంలో తేడాలు వచ్చి మెదడుకి రక్తప్రసారం అంతగా అందదు. ఫలితంగా నొప్పితో పాటు తల తిరగడం, మైకం, వాంతులు కూడా అవుతుంటాయి.
మన శరీరంలో ఎక్కువ కదలికలు ఉండేది వెన్నెముక. ఇక ఒత్తిడికి లోనయ్యేది మెడ. తలబరువుని మోస్తుంది. కాబట్టి, ఇంకా ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది. లైఫ్‌స్టైల్ వచ్చే ఇబ్బందుల వల్ల మెడ కండరాలు ఒత్తిడికి లోనై నొప్పి వస్తుంది. వీటితో పాటు వయసు పెరగడం, డిస్క్ అరిగిపోవడం వల్ల కూడా నొప్పి రావొచ్చు. సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల నొప్పి వస్తుంది.
మెడనొప్పి వచ్చినప్పుడు దాని వల్ల శరీరంలో మరెక్కడా నొప్పి రాకపోతే బాధపడాల్సిన అవసరం లేదు. అది చేతులు, భుజాల, వీపు వరకూ వస్తేనే ముందుగా డాక్టర్స్‌ని కలవాలి. కీళ్ళ నొప్పులు ఉన్నవారికి ఈ వెన్నుపూస జాయింట్లలో కూడా సమస్య వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల నొప్పి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. మెడలోనొప్పి వచ్చినప్పుడు మెడని కదపలేం. 90 శాతం నొప్పులు మనం తీసుకునే జాగ్రత్తల వల్లే నయం అవుతాయి.
జాగ్రత్తలు తీసుకుని మందులు వాడినా తగ్గకపోతే అవి సర్జరీ దాకా వెళ్తాయి. మన జీవన విధానం బాగుండేలా చూసి డాక్టర్స్ చెప్పిన సలహాలు కచ్చితంగా తీసుకోవాలి.
పెయిన్ కిల్లర్స్‌తో ప్రాబ్లమ్..
పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు అప్పటికప్పుడు కాస్తా రిలీఫ్ దొరికినా అది శాశ్వత పరిష్కారం అనుకోవద్దు. నొప్పిని తగ్గించే మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.
ఆలస్యం చేస్తే మెడనొప్పి పెరిగి ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. మెడనొప్పి తీవ్రత వల్ల మూత్రాశయంలో మార్పులు వచ్చే అవకాశం ఎక్కువ. నొప్పి ఎక్కడైనా నరాల మీద ఒత్తిడి పెరిగి మూత్రవిసర్జనలో తేడాలు వచ్చి ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
ఎక్స్‌రే స్కానింగ్..
మెడనొప్పితో వచ్చే వారికి ఎక్స్‌రే ద్వారా సమస్య తీవ్రతను కనుక్కోవచ్చు. ఎక్స్‌రేను బట్టి మెడపూసలలో ఏమైనా తేడాలు ఉన్నాయా? అనేది తెలుసుకుని దానిని బట్టి ట్రీట్‌మెంట్ ఇవ్వడం ఈజీ అవుతుంది. దానిని బట్టే పుట్టుకతోనే వెన్నుపూసలో సమస్యలు ఉన్నాయా.. మధ్యలో ఏమైనా వచ్చాయా.. వీటన్నింటిని గమనించాలి.
-DR.Syed Ameer Basha, Sr.Consultant Neuro Surgeon, CARE Hospitals
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Reference Link: https://telugu.samayam.com/lifestyle/health/these-are-the-health-tips-by-doctor-for-neck-pain-relief/articleshow/96875797.cms?story=6